Monday, February 23, 2009

సారాగర్హ్ యుద్దం

సారాగర్హి యుద్దం ఒక భయంకరమైన పోరాటం. కేవలం ఇరవైయొక్క మంది సిక్కులు పదివేలకు పైగా ఉన్న శత్రువులను ఎదుర్కొన్న యుద్దం. చనిపోతామని తెలిసి కూడా వెన్నుచూపని యోధులు. నభూతో నభవిష్యత్ అన్న రీనిలో భారతదేశంలో జరిగిన భయంకరమైన యుద్దం. వారందరూ 36వ రెజిమెంటుకు చెందిన సైనికులు. ఆ రెజిమెంటుకు నాయకుడు హవీల్దార్ ఇషార్ సింగ్.
అది 1897వ సంవత్సరం. అప్పటికి బ్రిటీషువారు పూర్తిగా భారతదేశం పట్టు సాధించినా ఇంకా అక్కడక్కడా చిన్న చిన్న యుద్దాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరభారతంలో రంజిత్ సింగు అప్పటికి సిక్కులనందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి అక్కడ గొడవలు జరగకుండా ఆపడానికి అనేక చిన్న చిన్న దుర్గాలు కట్టించాడు. వాటిలో ఒకటి ఈ సారాగార్హి (ప్రస్తుతం పాకిస్తానులో ఉంది). ఈ కోటకు పక్కనే దగ్గరలో ఉన్న మరొక కోట గులిస్తాను కోట. ఈ గులిస్తాను కోటపైకి సెప్టెంబరు మూడున మరియు తొమ్మిదిన కొన్ని తెగల వారు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినా వారందరినీ తిప్పికొట్టగలిగారు. ఆ దాడులు ఆగిన వెంటనే అన్ని దుర్గాలకు పూర్తి మరమ్మత్తులు చేసి అక్కడ ఉన్న టెలిగ్రాఫు పరికరాలను కొత్తవి అమర్చారు. అలా సారాగర్హి కోటకు ఒక నాన్-కమీషన్డ్ అఫీసరు (NCO) మరియు ఇరవైమంది అదర్ ర్యాంకు ఆఫీసర్లను (OR) నియమించారు. ఈ చిన్న చిన్న దుర్గాల వల్ల సమీపంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలకు సులభంగా టెలిగ్రాఫులను పంపుకోవచ్చు. అందుకు బ్రిటీషువారు ఈ దుర్గాలను కాపాడుకుంటున్నారు.
అది సెప్టెంబరు పన్నెండవ తారీఖు. తమ పాత దాడులు పని చేయలేదని ఈ సారి ఆఫ్రీది మరియు ఓరకాజాయి తెగలకు చెందిన వారు పెద్ద గుంపుగా వచ్చారు. ఈ సారి వారు సారాగర్హి మరియు గులిస్తాను దుర్గాలమీద ఒకేసారి దాడికి దిగారు. సారాగర్హిని ఆక్రమించుకోవడానికి మరియు గులిస్తాను నుంచి ఎటువంటి సాయం రాకుండా చూడడానికి ఇలా చేసారు. గులిస్తానులో ఉన్న ఒక ఆఫీసరు లెక్కపెట్టగా పదివేలనుంచి పన్నెండువేలమంది వరకు ఉన్నారు శత్రువులు.

అప్పటి యుద్దం వల్ల మిగిలిన అవశేషం

సారాగర్హిలో వేకువఝామునే మొదలయిన పోరాటం మిట్టమధ్యాహ్నంవరకూ కొనసాగింది. శత్రువులు పోరాటం చేస్తున్న ప్రతీసారి వారిని సిక్కులు దూరంగా ఉంచగలిగారు. ఈ సమయంలో గురుముఖ్ సింగ్ ఇక్కడ జరుగుతున్న యుద్దం గురించి ప్రతీ విషయాన్ని తన పై అధికారికి టెలిగ్రాఫు చేస్తున్నాడు. శత్రువులు లొంగిపొమ్మని లంచమివ్వడానికి ఎంత ప్రయత్నించినా మన సిక్కుసైనికులు అంగీకరించలేదు. అప్పుడు శత్రువులు పక్కనే ఉన్న పొదలచెట్ల చాటుకు చేరి వాటికి పొగ పెట్టారు. ఈ పొగలో కనబడకుండా ఒక గోడను కొంచెం పగులగొట్టగలిగారు. అప్పుడు కొంతమంది సైనికులు ఇలా గోడకు అడ్డంగా పోరాడడం మొదలుపెట్టారు. అలా కొంతమంది సైనికులు ముఖద్వారం వద్ద లేకపోవడంతో శత్రువులు ముందుకు రాగలిగారు. మన సైనికులు తమ వద్ద మందుగుండు సామాగ్రి అయిపోతున్నా, తమ సహచరులు నేలకొరుగుతున్నా లెక్కచేయకుండా పోరాడారు.
కానీ ఈ పోరాటం ఎక్కువసేపు నిలువలేదు. శత్రువులు మొత్తం మీద లోపలికి రాగలిగారు. ఇక అక్కడి నుంచి కత్తులతోటే యుద్దం ప్రారంభించారు మన సిక్కువీరులు. కానీ ఒక్కొక్కరే నేలకొరగడంతో అప్పటిదాకా ప్రతీ చిన్న విషయాన్ని కూడా తెలిగ్రాఫు చేసిన గురుముఖ్ వంతు వచ్చింది. తను కూర్చున్నది ఎత్తైన టవరు కావడం వల్ల అక్కడే ఉండు శత్రువుల మీదకు గుళ్ళవర్షం కురిపించాడు. కానీ అతని వద్ద కూడా ఎక్కువ బుల్లెట్లు లేకపోవడం వలన శత్రువులు బాగా ఎక్కువమంది రావడం వలన, గురుముఖ్ అందరినీ సంహరించలేకపోయాడు. వచ్చిన శత్రువులు అతను ఉన్న టవరుకు నిప్పంటించారు. దీనితో అందులో ఉన్న గురుముఖ్ సజీవంగా దహనమైపోయాడు. కానీ తనతో పాటు కనీసం ఇరవైమందిని తీసుకుపోయాడు. ఇలా ఆ ఇరవైఒక్క మంది పోరాటం ముగిసింది.
ఈ సంఘటనను బ్రిటీషు పార్లమెంటులో వినిపించినప్పుడు సభ్యులందరూ లేచినిలబడి సైనికులకు వందనాలర్పించారు. చనిపోయిన ప్రతీ సైనికుడికి Indian Order of Merit Class III (ఇప్పటి వీరచక్రకు సమానం) ప్రధానం చేసారు. ప్రతీ సైనికుడి కుటుంబానికి యాభై ఎకరాల స్థలం, మరియు అయిదువందల భరణం అప్పటి బ్రిటీషు ప్రభుత్వం ఇచ్చింది. ఇది గ్రీకుల 300కు ఏమాత్రం తీసిపోదు. కానీ ఆ గాధకు ఉన్నంత ప్రచారం మన యుద్దానికి లేదు. అప్పటి గ్రీకులయుద్దంలో అది కేవలం మూడువందలుకాదనీ అది వెయ్యిమందని తరువాత అనేకులు అభిప్రాయపడ్డారు.
భారతీయులందరూ ఎంతో గర్వంగా చెప్పుకోదగ్గ ఈ వీరగాధను ఫ్రెంచి ప్రభుత్వం వారి పిల్లలకు పాఠశాలలో చెబుతారు కానీ మనప్రభుత్వాలు మాత్రం చెప్పవు. దురదృష్టం ఏమిటంటే ఈ గాధ ఇప్పటి సిక్కులలో అనేకులకు తెలియకపోవడం. మనమందరం కనీసం ఇలాంటి గాధలను మన పిల్లలకైనా చెబుదాం, ఆ వీరుల ఆత్మకు శాంతిని చేకూర్చుదాం.

జైహింద్.

2 comments:

  1. adbutamaina prayatnam

    ReplyDelete
  2. mitrama kottaga emi rayara, chala kalamga vechi chustunna

    ReplyDelete