Monday, February 23, 2009

సారాగర్హ్ యుద్దం

సారాగర్హి యుద్దం ఒక భయంకరమైన పోరాటం. కేవలం ఇరవైయొక్క మంది సిక్కులు పదివేలకు పైగా ఉన్న శత్రువులను ఎదుర్కొన్న యుద్దం. చనిపోతామని తెలిసి కూడా వెన్నుచూపని యోధులు. నభూతో నభవిష్యత్ అన్న రీనిలో భారతదేశంలో జరిగిన భయంకరమైన యుద్దం. వారందరూ 36వ రెజిమెంటుకు చెందిన సైనికులు. ఆ రెజిమెంటుకు నాయకుడు హవీల్దార్ ఇషార్ సింగ్.
అది 1897వ సంవత్సరం. అప్పటికి బ్రిటీషువారు పూర్తిగా భారతదేశం పట్టు సాధించినా ఇంకా అక్కడక్కడా చిన్న చిన్న యుద్దాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరభారతంలో రంజిత్ సింగు అప్పటికి సిక్కులనందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి అక్కడ గొడవలు జరగకుండా ఆపడానికి అనేక చిన్న చిన్న దుర్గాలు కట్టించాడు. వాటిలో ఒకటి ఈ సారాగార్హి (ప్రస్తుతం పాకిస్తానులో ఉంది). ఈ కోటకు పక్కనే దగ్గరలో ఉన్న మరొక కోట గులిస్తాను కోట. ఈ గులిస్తాను కోటపైకి సెప్టెంబరు మూడున మరియు తొమ్మిదిన కొన్ని తెగల వారు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినా వారందరినీ తిప్పికొట్టగలిగారు. ఆ దాడులు ఆగిన వెంటనే అన్ని దుర్గాలకు పూర్తి మరమ్మత్తులు చేసి అక్కడ ఉన్న టెలిగ్రాఫు పరికరాలను కొత్తవి అమర్చారు. అలా సారాగర్హి కోటకు ఒక నాన్-కమీషన్డ్ అఫీసరు (NCO) మరియు ఇరవైమంది అదర్ ర్యాంకు ఆఫీసర్లను (OR) నియమించారు. ఈ చిన్న చిన్న దుర్గాల వల్ల సమీపంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలకు సులభంగా టెలిగ్రాఫులను పంపుకోవచ్చు. అందుకు బ్రిటీషువారు ఈ దుర్గాలను కాపాడుకుంటున్నారు.
అది సెప్టెంబరు పన్నెండవ తారీఖు. తమ పాత దాడులు పని చేయలేదని ఈ సారి ఆఫ్రీది మరియు ఓరకాజాయి తెగలకు చెందిన వారు పెద్ద గుంపుగా వచ్చారు. ఈ సారి వారు సారాగర్హి మరియు గులిస్తాను దుర్గాలమీద ఒకేసారి దాడికి దిగారు. సారాగర్హిని ఆక్రమించుకోవడానికి మరియు గులిస్తాను నుంచి ఎటువంటి సాయం రాకుండా చూడడానికి ఇలా చేసారు. గులిస్తానులో ఉన్న ఒక ఆఫీసరు లెక్కపెట్టగా పదివేలనుంచి పన్నెండువేలమంది వరకు ఉన్నారు శత్రువులు.

అప్పటి యుద్దం వల్ల మిగిలిన అవశేషం

సారాగర్హిలో వేకువఝామునే మొదలయిన పోరాటం మిట్టమధ్యాహ్నంవరకూ కొనసాగింది. శత్రువులు పోరాటం చేస్తున్న ప్రతీసారి వారిని సిక్కులు దూరంగా ఉంచగలిగారు. ఈ సమయంలో గురుముఖ్ సింగ్ ఇక్కడ జరుగుతున్న యుద్దం గురించి ప్రతీ విషయాన్ని తన పై అధికారికి టెలిగ్రాఫు చేస్తున్నాడు. శత్రువులు లొంగిపొమ్మని లంచమివ్వడానికి ఎంత ప్రయత్నించినా మన సిక్కుసైనికులు అంగీకరించలేదు. అప్పుడు శత్రువులు పక్కనే ఉన్న పొదలచెట్ల చాటుకు చేరి వాటికి పొగ పెట్టారు. ఈ పొగలో కనబడకుండా ఒక గోడను కొంచెం పగులగొట్టగలిగారు. అప్పుడు కొంతమంది సైనికులు ఇలా గోడకు అడ్డంగా పోరాడడం మొదలుపెట్టారు. అలా కొంతమంది సైనికులు ముఖద్వారం వద్ద లేకపోవడంతో శత్రువులు ముందుకు రాగలిగారు. మన సైనికులు తమ వద్ద మందుగుండు సామాగ్రి అయిపోతున్నా, తమ సహచరులు నేలకొరుగుతున్నా లెక్కచేయకుండా పోరాడారు.
కానీ ఈ పోరాటం ఎక్కువసేపు నిలువలేదు. శత్రువులు మొత్తం మీద లోపలికి రాగలిగారు. ఇక అక్కడి నుంచి కత్తులతోటే యుద్దం ప్రారంభించారు మన సిక్కువీరులు. కానీ ఒక్కొక్కరే నేలకొరగడంతో అప్పటిదాకా ప్రతీ చిన్న విషయాన్ని కూడా తెలిగ్రాఫు చేసిన గురుముఖ్ వంతు వచ్చింది. తను కూర్చున్నది ఎత్తైన టవరు కావడం వల్ల అక్కడే ఉండు శత్రువుల మీదకు గుళ్ళవర్షం కురిపించాడు. కానీ అతని వద్ద కూడా ఎక్కువ బుల్లెట్లు లేకపోవడం వలన శత్రువులు బాగా ఎక్కువమంది రావడం వలన, గురుముఖ్ అందరినీ సంహరించలేకపోయాడు. వచ్చిన శత్రువులు అతను ఉన్న టవరుకు నిప్పంటించారు. దీనితో అందులో ఉన్న గురుముఖ్ సజీవంగా దహనమైపోయాడు. కానీ తనతో పాటు కనీసం ఇరవైమందిని తీసుకుపోయాడు. ఇలా ఆ ఇరవైఒక్క మంది పోరాటం ముగిసింది.
ఈ సంఘటనను బ్రిటీషు పార్లమెంటులో వినిపించినప్పుడు సభ్యులందరూ లేచినిలబడి సైనికులకు వందనాలర్పించారు. చనిపోయిన ప్రతీ సైనికుడికి Indian Order of Merit Class III (ఇప్పటి వీరచక్రకు సమానం) ప్రధానం చేసారు. ప్రతీ సైనికుడి కుటుంబానికి యాభై ఎకరాల స్థలం, మరియు అయిదువందల భరణం అప్పటి బ్రిటీషు ప్రభుత్వం ఇచ్చింది. ఇది గ్రీకుల 300కు ఏమాత్రం తీసిపోదు. కానీ ఆ గాధకు ఉన్నంత ప్రచారం మన యుద్దానికి లేదు. అప్పటి గ్రీకులయుద్దంలో అది కేవలం మూడువందలుకాదనీ అది వెయ్యిమందని తరువాత అనేకులు అభిప్రాయపడ్డారు.
భారతీయులందరూ ఎంతో గర్వంగా చెప్పుకోదగ్గ ఈ వీరగాధను ఫ్రెంచి ప్రభుత్వం వారి పిల్లలకు పాఠశాలలో చెబుతారు కానీ మనప్రభుత్వాలు మాత్రం చెప్పవు. దురదృష్టం ఏమిటంటే ఈ గాధ ఇప్పటి సిక్కులలో అనేకులకు తెలియకపోవడం. మనమందరం కనీసం ఇలాంటి గాధలను మన పిల్లలకైనా చెబుదాం, ఆ వీరుల ఆత్మకు శాంతిని చేకూర్చుదాం.

జైహింద్.

Tuesday, February 17, 2009

భారతదేశం నిజంగా సెక్యూలరిస్టు దేశమా?

భారత రాజ్యాంగంలో మన దేశం సెక్యూలరిస్టు అని ఉంటుంది. సెక్యూలరిస్టు అంటే అర్థం ఏమిటి? సెక్యూలరిస్టు అంటే ప్రభుత్వం అన్ని మతాలనూ సమానంగా చూడడం మరియు ఏ ఒక్క మతానికి అధిక ప్రాధాన్యం ఇవ్వకపోవడం. మరి మన దేశం నిజంగా సెక్యూలరిస్టు దేశమా అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి.

మనం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సంఘటనలను పరిశీలించి నిజంగా భారతదేశంలో సెక్యూలరిజం ఉన్నదో లేదో తేల్చుకుందాం. మొదట ఈ మధ్య మంగుళూరులో జరిగిన ఘటన. ఇది పబ్బు సంస్కృతికి వ్యతిరేఖంగా శ్రీరామ సేనవారు చేసిన ఘనకార్యం. ఈ సంఘటన తరువాత అన్ని పత్రికలు బిజేపీని, RSSను వాటి పద్దతులను విమర్శించాయి. దీని గురించి తరువాత వివరిస్తాను. ఇది జరిగిన కొన్ని రోజులకే బహిరంగంగా ముద్దు పెట్టుకుంటున్నందుకు ఒక జంటపై పోలీసులు కేసు నమోదు చేసారు. అది బహిరంగంగా జరిగినందువల్ల అసభ్యంగా భావించి కేసు పెట్టారు. నిజంగా ముద్దు పెట్టుకోవడం అసభ్యమా? అది పశ్చిమదేశాలలో కాదే? మరి మన దేశంలో మాత్రం ఎందుకు అసభ్యమైంది? ఎందుకంటే అది మన సంప్రదాయం కాదు కాబట్టి మరియు అలాంటి శృంగార కార్యాలు కేవలం ఇంటిలో జరిగితేనే బాగుంటాయి కాబట్టి. అది చూసిన జడ్జిగారు వారిద్దరూ వివాహితులైన జంట కారణంగా ఆ కేసును కొట్టివేసారు. ఇక్కడ పోలీసులు ఎందుకు కేసు పెట్టారు? అది ప్రజలకు ఇబ్బందికరమైనది కాబట్టి. ఇలా ఒక జంట ముద్దులు పెట్టుకున్నందువల్ల మరికొన్ని జంటలు కూడా ఆ బాటలోనే పయనిస్తారు. ఇప్పుడు వీరిరువురికీ వివాహం జరిగింది. రేపు వివాహం జరగనివారు అదే పని చేస్తే? అప్పుడు ఆ జడ్జిగారు ఏమని తీర్పు ఇస్తారు? మన సంప్రదాయం ప్రకారం శృంగారకర్యాలు కాస్త నాలుగు గోడల మధ్య జరిగితే అందం చందం. సరే వివాహితులు కాబట్టి ఏ పనైనా బహిరంగంగా చేయవచ్చా? ఇప్పుడు ముద్దులతో మొదలయ్యింది, రేపు మిగిలిన శృంగార కార్యాలు అ తరువాత కాలకృత్యాలు, ఇక ఇవేగా మిగిలినది. ఇప్పుడు ముద్దులు వివాహితులు పెట్టుకున్నారు, రేపు అవివాహితులు పెట్టుకుంటారు. వారిపై కేసులు నమోదు చేయలేరు పోలీసులు. రేపు మరోసారి ఇలా ముద్దులు బహిరంగంగా పెట్టుకుంటున్న జంటను చూచి పోలీసులు వారు వివాహితులు అని వదిలేస్తారు. ఎందుకంటే ముద్దు పెట్టుకుంటున్న వారందరినీ ఆపి మీకు వివాహం అయ్యిందా అని పోలీసులు వారిని అడిగి, ఓహో అయ్యిందా సరే మీరు కానివ్వండి అని అనాలేమో. అలా అలా అందరూ మొదలుపెడతారు. ఇలాంటి చిన్న చిన్న తీర్పులే సమాజానికి ఎంతో హానికరం. ఒక గౌరవప్రదమైన జడ్జిగారు ఇవ్వవలసిన తీర్పు కాదిది. కానీ ఏమి చేస్తాం, ఇలాంటి వాటిపై మనం హైకోర్టులో పిటీషను వేయలేం కదా. నా ఉద్దేశంలో పై రెండు సంఘటనలకు పెద్ద తేడాలేదు శిక్ష అమలు చేసిన వారిలో తప్ప. ఒకరు (పోలీసులు) చట్టపరంగా అందుకు అర్హులు రెండోవారు (శ్రీరామ సేన) అనర్హులు. పై రెండు ఘటనలవల్ల సమాజానికి చివరికి జరిగేది నష్టమే.

ఇప్పుడు మంగుళూరు సంఘటన కాకుండా డావిన్సీ కోడు సినిమా, దాని మీద జరిగిన వివాదం గురించి మనం మాట్లాడుకుందాం. ఆ చిత్రం విడుదలకు అన్ని క్రైస్తవసంఘాలు కాదన్నాయి. విడుదలైన చోట్ల బాగా గొడవలు చేసారు. మంగుళూరు ఘటనకు ఈ గొడవలకు ఏమైనా తేడా ఉన్నదా? ఆ చిత్రం ఏసు గురించి మనకు తెలిసిన నిజాలను కాక మరికొన్ని నిజాలను మనకు చెబుతుంది. ఆ చిత్రం తీసిన నిర్మాతలు (నవల రచయిత) ఆ నిజాల గురించి ఎంతో శోధించి శాస్త్రోక్తంగా ఎన్నో తెలియని విషయాలను నిరూపించి అప్పుడు ఆ చిత్రాన్ని విడుదల చేసారు. ఆ చిత్రాన్ని ఎన్నో క్రైస్తవ దేశాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా విడుదలకు అంగీకరించాయి. చివరికి పోపుకూడా అందుకు అంగీకరించాడు. కానీ అదేంటో భారతదేశంలో మాత్రం ఆ చిత్రాన్ని విడుదల చేయనివ్వలేదు. ఆ చిత్రం చూసినందువల్ల నష్టమేమీలేదని స్వయంగా పోపుగారు అంగీకరించారు. కానీ మన కోర్టులు అందుకు అంగీకరించలేదు. అదే మన సంస్కృతిని కాపాడుదామని ప్రయత్నిస్తే మాత్రం అది అన్ని విధాలా స్వేఛ్ఛకు ఆటంకం అయ్యింది. ఆ చిత్రాన్ని విడుదల చేయాల్సినప్పుడు ఏమైంది ఆ వ్యక్తిగత స్వేఛ్ఛ? ఏమైంది ఆ సెక్యూలరిజం అన్న పదం? పోలీసులు అసభ్యంగా ఉన్నదని కేసు పెట్టారు, మరి అప్పుడు కావలసిన వ్యక్తిగత స్వేఛ్ఛ చిత్రాన్ని (నిర్మాత విడుదల) చేయాల్సినప్పుడు ఏమైంది? ఇది చూసి కూడా మీరు భారతదేశంలో ఇంకా సెక్యూలరిజం ఉన్నది అనుకుంటే పొరబడినట్లే.

Monday, February 16, 2009

కుల వ్యవస్థ: చికిత్స

కులాల గురించి మాట్లాడేవారు ఒక్క విషయం మరిచిపోతున్నారు. గత వందసంవత్సరాలనుంచీ ఉద్యోగం ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు? చదువులమీద ఆధారపడి ఇస్తున్నారు. ఒక్కసారి కాలంలో వెనకకు వెళదాం. వెయ్యి సంవత్సరాల క్రితం ఏ ప్రాతిపదికన ఇచ్చేవారు? ప్రతీ ఒక్కళ్ళకీ కులవృత్తులు ఉన్నాయి. వారి తల్లిదండ్రులనుంచి వారసత్వంగా సంక్రమించిన వృత్తి, మరియు చిన్నతనం నుండి తండ్రితో బాటు చేస్తున్న పనిగురించి తండ్రి నేర్పే అనేక వృత్తికిటుకులు ప్రతీ ఒక్కరినీ వారి వారి పనులలో నిష్ణాతులను చేసేది. అందువల్ల చదువుతో సంబంధం లేకుండా ప్రతీఒక్కరికీ పని ఉండేది. మరి ఎందుకు చదువుకొనేవారు? సంస్కారం కోసం చదువుకునేవారు. ఒక శాస్త్రంలో ప్రావీణ్యతకోసం చదువుకునేవారు(Like today’s PhD in a specific field). జీవితంలో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి చదువుకొనేవారు. అందువల్లనే మనదేశంలో ఒక ఆర్యభట్టు, ఒక భాస్కరాచార్యుడు, ఒక సుష్రుతుడు పుట్టారు. అప్పటికాలం ప్రకారం చదువు కేవలం మనిషిని సంస్కరించడానికి లేక ఒక శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించడానికి మత్రమే ఉపయోగపడేది. ఇప్పటివలె చదువువల్ల ఉద్యోగం వచ్చే రోజులు కావవి. అందువల్ల కేవలం అవసరం ఉన్నవారు మాత్రమే చదువుకొని మిగతావారు పట్టించుకొనేవారు కాదు. ఒకళ్ళు చదువుకోకపోవడం వలన ఆ రోజులలో తిండికి ఇబ్బందిపడటం వంటివి జరుగలేదు. ఇవి వెయ్యిసంవత్సరాల నాటి పరిస్థితులు. బ్రిటీషర్లు వచ్చాక పరిస్థితి మారింది. వాళ్ళు పద్దతి మార్చి కేవలం చదువుకున్నవారికి మాత్రమే ఉద్యోగం ఇచ్చేవారు. అందువల్ల సాంప్రదాయకంగా చదువుకోని కుటుంబాలు అలా ఉద్యోగాలలో వెనుకబడ్డారు. ఇవికాక బ్రిటీషర్లు ఇచ్చే విద్య ఖర్చుకో కూడుకున్నది కావడంతో కేవలం ధనవంతులు(పొరపాటున ఎక్కువమంది ధనవంతులు ఒకే కులం వారు అయ్యారు. ఎక్కువమంది మాత్రమే, అందరూ కాదు) మాత్రమే చదువుకొనేవారు. దీనిని మరో ఉదాహరణతో వివరిస్తాను. ఇప్పుడు మనం డబ్బును కాగితాల రూపంలో వాడుతున్నాం. హఠాత్తుగా Government of India అవన్నీ వాట్టి కాగితాలే, వాటికి విలువలేదు, ఇకనుంచి కరెన్సీ మొత్తం గవ్వలరూపంలో జరగాలి అని అంటే అప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు బాగా Black Money ఉన్నవారందరూ వట్టి వెధవలయిపోతార్. అప్పుడు ఎవరివద్దనయితే ఎక్కువగా గవ్వలు ఉంటాయో వాడే ధనవంతుడు. మనకు సరిగ్గా అదే జరిగింది. తరతరాలనుంచీ చదువుకొనేవారు ముందుకుసాగిపోయారు, అది అలవాటులేని వాళ్ళు అందుకోలేక పోయారు. ఉద్యోగం వచ్చే పరిస్థితి మారింది. అదే విధంగా మారిని పరిస్థితులగురించి బాగా ప్రచారం చేసి అందరినీ ఇందుకు తగ్గట్లుగా ఉద్యక్తులను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, కాని అప్పటి ప్రభుత్వం బ్రిటీషువారిది, వారికి అంత తీరిక ఎక్కడిదీ, దేశాన్ని దోచుకోవడానికే సమయం సరిపోలేదు వారికి.

ఇంతవరకూ నేను భారతదేశంలో వర్ణవ్యవస్థ నుంచి కులవ్యవస్థగా ఎలా పతనమయ్యిందో వివరించాను. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మనం ఏమి చేస్తే ఈ కులవ్యవస్థను పారద్రోలగలమో వివరిస్తాను. ఇంతకన్నా ముందు నేను ఒక విషయాన్ని గుర్తుచేయదలిచాను. సమాజం ఎప్పుడైనా బాగా చదువుకున్న అతి తక్కువ జనభాను అనుసరిస్తారు. అలా అంబేద్కర్ గారు మొదలుపెట్టినది అలా కొనసాగలేదు, ఇప్పటికి కులవ్యవస్థ్ తగ్గకపోగా ఇంకా వికృతంగా తయరయ్యింది. దీనికి కారణం ఏమిటి? ఒకసారి TV9లో ఒక ఫ్యాక్సనిస్టు తాను ఇరవైసంవత్సరాలుగా గొడవలలో మునిగిఉన్నానని, తనకు తన శత్రువుకు కూడా ఆ జీవితం ఎంతమాత్రం నచ్చకపోయినా తాము అలా జీవించాల్సివస్తుందని వాపోయారు. దీనికి కారణం ఎవరు? సమాధానం మన రాజకీయనాయకులు.

అవును మనం మన మధ్య, మనలో ఇది మన కులం అని చెప్పే ప్రతీ వస్తువునూ, ప్రతీ గోడను పడగొట్టగలిగితే ఈ కులవ్యవస్థను మనం పారదోలవచ్చు. దీనికి మనం మొదటా చేయాల్సినది చాలా చిన్నపని. అది ఏమిటంటే చరిత్రను మార్చి రాయడం. నేను ఇంతవరకూ రాసిన చరిత్ర కాకుండా, అసలు కులవ్యవస్థ చాలా అద్భుతమైనదిగా చిత్రీకరించాలి. అసలు కులవ్యవస్థ జరుగలేదనిపించేలా మన సామాన్య చరిత్ర పుస్తకాలు తయారుచేయాలి. ఎవరికైనా అనుమానం రావచ్చు, ఇది మన భావి తరాల వాళ్ళకి అబద్దం చెప్పడంతో సమానం కదా అని, పరవాలేదు మొదట అలా చేస్తే మన భావితరం తాము తక్కువవరమనే భావనలో (Inferiority Complex) నుంచి బయటపడతారు. అన్నింటికన్నా ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే మన గొప్పతనమంతా మన వారసత్వసంపదలోనే ఉంది. బ్రిటీషువాళ్ళు అందుకే మన వారసత్వసంపదను మనది కాకుండా చేసారు ఆర్య దండయాత్ర సిద్దాంతం (Aryan Invasion Theory) ద్వారా. నాకు ఇప్పటి తరంలో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కనబడుతోంది. దానికి ఉదాహరణ, ఇంతవరకు హిందూమతం మరియు భారతదేశం ఇంత అభివృద్ది చెందడానికి కారణమయిన వర్ణవ్యవస్థ ఇవ్వాళ అందరిచేత నిందింపబడుతోంది తన తప్పులేకుండా. ఇవ్వాళ అన్నికాలాల్లోనూ వర్ణవ్యవస్థకు ఎంతమంది స్థిరంగా మద్దతివ్వగలరు? అగ్రకులాలవారు తాము నిమ్నకులాలవారిపై చాలా అరాచకాలు చేసామని బాధపడుతున్నారు (కనీసం అలా నటిస్తున్నారు మరియు పిల్లలకు అలా నేర్పిస్తున్నారు. దీనిలో సినిమాల పాత్రకూడా ఎక్కువే). ఒక బ్రాహ్మణుడు నేను బ్రాహ్మణుడిని అని గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి మనది ఎందుకంటే అతను ఒక కులపిశాచని అందరూ తిడతారని భయం. ఇది మారాలి. అందరూ ఒకటేననే భావం కలగాలి. ఈ ఇన్పీరియారిటీ కాంప్లెక్స్ పోవడానికి నేను చరిత్రను మార్చి చెప్పమన్నాను. అది కేవలం సామాన్య చరిత్ర అంటే పదవతరగతి వరకూ చెప్పే చరిత్ర. చరిత్రను చదివేవారికి నిజమయిన చరిత్రను పరిచయం చేయాలి. ఇది నేను రాసిన చరిత్రే, కాదని ఎవరినైనా వివరించమనండి చూద్దాం. కానీ ఆ చరిత్ర నిష్పక్షపాతంగా ఉండాలి, హిందూ వ్యతిరేఖిగా ఉండకూడదు. ఎందుకంటే హిందూ మతాన్ని ప్రేమించలేనివాడు భారతదేశాన్ని ప్రేమించలేడని నా ఉద్దేశం. ఇక్కడ హిందువంటే నా దృష్టిలో భారతదేశంలో పుట్టిన ఏ మతాన్నయినా పాటించేవ్యక్తి. చరిత్రను ఇలా మార్చిరాయడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని అనుమానం అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటి వరకు మనకు చెప్పిన చరిత్రలో తొంభై అయిదు శాతం అబద్దాలే. దీని వలన మనకు మన నిజమైన చరిత్ర తెలియదు, అలాగే మనం ఈ కులవ్యవస్థను చరిత్రలోంచి (చరిత్ర పాఠాలలొనుంచి) తొలగిస్తే మనం ఈ వ్యవస్థను మన నుంచి సగం పారద్రోలగలిగినట్లే.

మనకు మన కులాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తున్న మరో దుర్వవస్థ రిజర్వేషనులు. కులాల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషనులను ఇస్తే నిజమైన పేదలకు చాలా ఉపయోగం. ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు. ఈ వ్యవస్థ మన సమాజాన్ని ఎంత దారుణంగా దెబ్బతీస్తోందో మనకు తెలుసుకాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పదలచుకోలేదు.

ఇవికాక మన కులాన్ని మనకు అనుక్షణం గుర్తుచేసేవి కులసంఘాలు. వీటివల్ల జరుగుతున్న కీడు అంతా ఇంతా కాదు. నేను కులసంఘాలు ఇచ్చే స్కాలర్షిప్పులు గురించి మాట్లాడుతున్నాను. నిజమే. వాళ్ళు ఇలా ఇవ్వడం వలన కనీసం కొంతమందైనా (నిజమైన) పేదలకు కొంత సహాయం జరుగుతోన్న మాట నిజమే. కొంతమందైనా పేదవిద్యార్థులు చదువుకోగలుతున్నారు. కానీ దీనివల్ల ఆ పేద విద్యార్థి ఏమి అనుకుంటాడు? నాకు ప్రభుత్వం ఏమీ సహాయం చేయనప్పుడు నాకులపు వాళ్ళు ఎంతో మేలు చేశారని అనుకుంటాడు. దీనివల్ల అతనికి ప్రభుత్వం మీద వ్యతిరేఖత, తన కులం మీద విపరీతమైన ఆసక్తి కలుగుతుంది. అతనిలో లేని కులకాంక్ష ప్రజ్వల్లితుంది. ఇలా కులం పేరు మీద ఇచ్చే స్కాలర్షిప్పులు మరియు కులం పేరు మీద ఇచ్చే రిజర్వేషనులకు తేడా లేదు. అంతిమంగా దేశం నష్టపోతోంది.

నాకు నేను ఇలా వ్రయడం వల్ల నన్ను ఒక హిందూ అతివాదిగా అనేక మంది అనుకుంటారు, దానివల్ల నా మాట ఎవ్వరూ వినరని కూడా నాకు తెలుసు. కాని నేను చెప్పేది ఒక్కటే. ఇలా ఎన్నాళ్ళు? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పరవాలేదు, కానీ ఒక్కసారైనా నిజం చెప్పాలి. ఇలా నాలా చెప్పేవాళ్ళనందరినీ పట్టించుకోకుండా ఉండి మీడియా మనకు చెబుతున్న అబద్దాలనే నమ్మితే ఏదో ఒక రోజు మనబ్రతుకులే అబద్దంగా మారిపోతాయి.

Friday, February 13, 2009

కుల వ్యవస్థ: నాలుగవ భాగం

క్రితం టపాలో నేను కొన్ని ప్రశ్నలు అడిగాను. వాటిలో నేను కొన్నింటికి జవాబులు చెబుతాను. మెగస్తనీసు కాలం తరువాత భారతదేశం గురించి వివరంగా రాసిన మరో వ్యక్తి చైనీసు యాత్రికుడు హుయాన్ సాంగ్. అతని రాతలలో కులవ్యవస్థ గురించి ఏమీ రాయలేదు, కానీ అప్పటికి భారతదేశంలో బౌద్దమతం పూర్తిగా అంతమయ్యింది. ఇక్కడి నుంచి కులవ్యవస్థ పతనమవ్వడం మొదలయ్యింది. అది భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యింది. ఎందుకంటే ఉత్తరభారతదేశంలో 1198లో మూల్ రాజ్ ఆనంద్ అనే బాలుడి తల్లి (ఆమే ఆ రాజ్యానికి సైన్యాధిపతి కూడా) ముస్లిము సైన్యాన్ని యుద్దంలో ఓఢించి ముస్లిము సైనికులను హైందవ సమాజంలో కలుపుగోలిగింది. అప్పటికి ఇంకా బానిసవ్యవస్థ భారతదేశంలో లేదు కాబట్టి వారిని బానిసలుగా అమ్మలేదని మనం నిర్ధారణకు రావచ్చు. దీనిని బట్టి పదవ శతాబ్దానికి, క్రీస్తుకు మూడు శతాబ్దాల ముందు దానికి సమాజంలో పెద్దగా మార్పులు లేవని మనం రూఢి చేసుకోవచ్చు. పదవశతాబ్దం వరకూ దాదాపు హిందువులే (హిందువులంటే నా ఉద్దేశంలో బౌద్దులు, జైనులు, శైవులు, వైష్ణవులు, శక్తిని పూజించేవారు, ద్వైతులు, అద్వైతులు, చార్వకులు etc. ఇలా భారతదేశంలో పుట్టిన ఏ మతాన్ని ఆచరించినా నా దృష్టిలో వారు హిందువులే. దీని గురించి మరో టపాలో వివరిస్తాను.) భారతదేశాన్ని పాలించారు. పాలించేవారు, పాలించే పద్దతులలో పెద్దగా మార్పులు లేవు కాబట్టి సమాజంలో కూడా పెద్దగా మార్పులు లేవు. కానీ పదవశతాబ్దం నుంచి ఇరవైశతబ్దానికి వచ్చేసరికి ఏడుకులాలనుంచి లెక్కలేనన్ని కులాలు వచ్చిపడ్డాయి సమాజంలో. ఎలా జరిగింది ఇది అంతా? ముందు కాలానికి ఇప్పటికి తేడా ఏమిటి? గమనిస్తే బయటినుంచి దాడులు విపరీతంగా పెరిగాయి. అంతర్గతంగా జరిగే యుద్దాలకు బయటినుంచి వచ్చిన ఇతర మతస్థులతో జరిగే యుద్దాలకు చాలా తేడా ఉంది. ఉదాహరణకు ఒకటి. ఇక్కడి యుద్దాలలో ఎవరు గెలిచినా సామాన్య ప్రజలపై పెద్దగా ప్రభావం ఉండేది కాదు, కానీ ముస్లిముల్ వచ్చాక పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. వారు గెలిస్తే ఇక్కడి ప్రజలను బానిసలుగా అమ్మేవారు. అందుకే సమాజంలో చాలా మార్పులు అనివార్యమయ్యాయి.
కొంతమంది హిందూ మతం గురించి చెప్పే మరో విషయం ఏమిటంటే హిందూమతం మార్పును స్వీకరించదని. వారికి నేను చెప్పబోయేది చెంపపెట్టు లాంటిది. కొన్ని చోట్ల కులవ్యవస్థ చాలా దారుణంగా పతనమయ్యింది. దీనికి వ్యతిరేఖంగా కులవ్యవస్థలో మార్పును కోరుతూ సమాజంలో కొందరు సమాజాన్ని బాగుచేయడానిక్ ప్రయత్నించారు. ఇలా ప్రయత్నించడం రెండు రకాలు. ఒకటి హింసాత్మకం, రెండు అహింసాత్మకం. హింసాత్మకంగా జరిగిన పోరాటం మన పలనాటియుద్దం. మార్పును వ్యతిరేఖించే నాగమ్మ వర్గానికి మార్పును కోరుకుంటున్న బ్రహ్మనాయుడి వర్గానికి మధ్య జరిగిన యుద్దం అది. మనకు సినిమాలో చూపించినట్లు కాకుండా నిజమైన యుద్దంలో బ్రహ్మనాయుడి వర్గం పరాజయాన్ని పొందారు. మలిదేవనాయుడు, నగమ్మ కులాల్లో మార్పును వ్యతిరేఖించారు, నలగామనాయుడు మరియు బ్రహ్మనాయుడు కులాల్లో మార్పును కోరారు. ఈ యుద్దం వల్ల జరిగినది ఏమిటంటే ఇరువర్గాల్లో సైనుకులు మొత్తం చనిపోయారు. ఈ యుద్దం వల్ల చాలుక్యుల వంశం త్వరగా అంతమయింది. ఈ కథను మనకు హరికథలుగా మాదిగలు మాత్రమే వినిపిస్తారు, కానీ అన్నిరకాల హరికథలు వినిపించే బ్రాహ్మణులు ఈ కథను మనకు వినిపించరు. శ్రీనాథుడు బ్రాహ్మణుడు అయినా ఈ చరిత్ర గ్రంథస్తం చేసాడు. చూసారుగా తేడాలు, బ్రాహ్మణులలో. ఒకరు మనకు ఈ కథను చెప్పరు, మరొకరు గ్రంథస్థం చేసారు. మార్పును వ్యతిరేఖించే వారు ఎప్పుడయినా ఉంటారు, అదే జరిగింది అప్పటి సమాజంలో.
ఇప్పుడు మనం అహింసాత్మకంగా మార్పును కోరిన ఉద్యమాన్ని చూద్దాం. హింస మన కోస్తాంధ్రలో జరిగితే, అహింసాయుత విధానం మన పక్కనే ఉన్న కర్ణాటకలో జరిగింది. అది పన్నెండవ శతాబ్దం. కులవ్యవస్థ ఉన్న పరిస్థితి నచ్చక బసవన్న అనే ఒక బ్రాహ్మణుడు వీరశైవమనే కొత్త మతాన్ని ప్రారంభించాడు. తన మతంలో అందరూ సమానమేనని చెప్పాడు. చనిపోయిన వాళ్ళను హిందువులలా దహనసంస్కారాలతో కాకుండా పూడ్చిపెట్టమని చెప్పాడు. కొన్నాళ్ళు బాగానే సాగింది. కానీ తరువాత వీరశైవులు ఒక కులంగా మారిపోయారు. అంతే కాకుండా వారిలో ఉపకులాలు కూడా వచ్చాయి. మరి ఈ రెండు పద్దతులవల్ల మనసమాజానికి మేలు జరిగిందా లేక కీడు జరిగిందా? రెంటిలో ఏదైనా ఒకటి ఖచ్చితంగా పనిచేయాలి, కానీ మనకు ఇరవై శతాబ్దంలో సమాజాన్ని చూస్తే పెద్దగా ఉపయోగం ఉన్నట్లు కనబడదు. ఎందుకు ఇలా జరిగింది? మధ్యలో కొన్నాళ్ళు ముస్లిములు పాలించారు, తరువాత విజయనగర సామ్రాజ్యంతో ఉన్నత స్థాయిని అందుకున్నాము, మళ్ళీ ముస్లిముల చేతిలోకి పాలన వెళ్ళాక పరిస్థితి మామూలు అయ్యింది. విజయనగర సామ్రాజ్యం ఆంధ్రను పాలించినప్పుడు మనం సాంస్కృతికంగా ఎంత బాగా అభివృద్ది చెందామో మనకు తెలుసు. శ్రీకృష్ణదేవరాయలవారి కాలంలో వజ్రాలను రాశులుగా పోసి అమ్మేవారని మనకు చరిత్ర చెబుతున్న సత్యం. దీనిని బట్టి పలనాటి యుద్దం తరువాత సమాజంలో చెడు బాగా తగ్గిందని మనం అర్థం చేసుకోవచ్చు.

ముస్లిముల పాలన గురించి ఇతరులు ఏమి చెప్పారో చూద్దాం. మనకు 712 ADలో మహమ్మద బిన్ ఖాసీం నుంచి ముస్లిముల దండయాత్ర మొదలయ్యాయి. నిజం చెప్పాలంటే ముస్లిము దండయాత్రలు 638 AD లో మొదలయ్యాయి, కానీ వారికి చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం 712 తరువాతే వచ్చాయి. కొన్నాళ్ళు బాగానే సాగినా తరువాత ఆ దండయాత్రలు ఆగిపోయాయి. (ముస్లిము దండయాత్రల గురించి తరువాతి టపాలలో వివరిస్తాను) తరువాత 990 AD లో మళ్ళీ దండయాత్రలు మొదలయ్యాయి, అవి మహమ్మద్ గజినీ కొడుకు మరణంతో ఆ దండయాత్రలు ముగిసాయి. తరువాత చెప్పుకోదగ్గ దండయాత్రలు 1191లో మహమ్మద ఘోరీతో మొదలయ్యాయి. ఇక ఆ దండయాత్రలు ఆగలేదు. అవి భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించేంతవరకూ విశ్రమించలేదు. భారతదేశాన్ని సైనికంగా ఎనిమిది వందల సంవత్సరాలకుపైగా అక్రమించుకోగలిగినా హిందువులను పూర్తిగా ముస్లిములుగా మార్చలేకపోయారు. ఇది వారి దయవలన ఎంతమాత్రం కాదు, ఎందుకంటే వారికి దయ అనేది తెలియదు కాబట్టి. ఇస్లాము ప్రవేశించిన ఇతర దేశాలను గమనిస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది.

ఫెర్నాంన్డ్ బ్రౌడెల్ తన పుస్తకంలో(1) “భారతదేశంలో ముస్లిముల పాలన చాలా హింసాత్మకమయినది, ముస్లిములు ప్రజలను విపరీతమయిన భయాందోళనలకు గురిచేస్తూ తప్ప దేశాన్ని పాలించలేకపోయారు. కౄరత్వం అనేది రోజూవారీ కార్యక్రమం అయిపోయింది. తగులబెట్టడం, సామూహికంగా ప్రజలను ఉరితియ్యడం, ప్రజలను శిలవేయడం, చర్మాన్ని తొలిచివేయడం, కొత్త కొత్త రకాలుగా ప్రజలను చంపడం వంటివి దైనందిక వ్యవహారమయిపోయాయి. హిందువుల గుడులు నిర్మూలించి మసీదులు కట్టారు. అప్పుడప్పుడూ హిందువులను ముస్లిములుగా మార్చేవారు. ఎక్కడైనా ప్రజలు తిరగబడితే అక్కడి ప్రజలను దారుణంగా హింసించి చంపేవారు, ఊళ్ళకు ఊళ్ళు తగులబెట్టేవారు, పల్లెటూర్లను ఎప్పుడు ఎండబెట్టేవారు, మగాళ్ళను చంపేవారు, ఆడవాళ్ళను బానిసలుగా అమ్మేవాళ్ళు”, అని రాసాడు. విల్ డ్యూరాంట్ తన పుస్తకంలో(2) “భారతదేశంలో ముస్లిముల దండయాత్ర బహుశా ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్తపాతమయినది. అది ఒక నిరాశాజనకమైన కథ, ఎందుకంటే ఇక్కడి నాగరికత చాలా నాజూకైనది, ఇక్కడి స్వేఛ్ఛాస్వాతంత్రాయాలు ఎప్పుడైనా బయటినుంచీ లోపలినుంచీ విపరీతంగా పెరిగిపోతున్న అనాగరికుల చేత ఎప్పుడయినా నిర్మూలించబడతాయి”, అని రాసాడు. వీళ్ళిద్దరూ క్రైస్తవులు మరియు పాశ్చాత్యులు. వీరి మాటలలో అప్పటి హిందూసమాజం ఎలాంటి పరిస్థితులలో ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పటి కులవ్యవస్థకు కారణం ఖచ్చితంగా ఆ దండయాత్రలు, మరియు అప్పటి హిందూ సమాజం అనుభవించిన యాతనలు. వర్ణవ్యవస్థ పతనమవ్వడం అలా మొదలై బ్రిటీషర్లు వచ్చాక బాగా ఊపందుకుంది.

జయచాంద్ విద్యాలంకార్ తన “ఇతిహాస్ ప్రవేశ్”లో ఇలా వ్రాసాడు, “కులవ్యవస్థ మొదలైనప్పుడు కాస్త Flexibility ఉండేది, కానీ అది కాలం ముందుకు సాగడంతో పోయింది. 1000 AD నుంచి కులవ్యవస్థలో Flexibility తగ్గి పూర్తిగా జడపదార్థంలా తయారయింది. దీనికి కారణం ముస్లిములు సాగించిన హింసాకాండ. వారు జరిపిన హత్యలు, మానభంగాలు, దేశాన్ని దోచుకోవడం ద్వారా ప్రజలను బాగా భయపెట్టి తమ మతంలోకి మార్చుకున్నారు.” ముస్లిముల దండయాత్రలు ఎంత ఎక్కువగా ఉండేవంటే గుజరాత్ లోని గవల్గరాజ్యంలో “తురుష్కదంద” అనే ప్రత్యేక పన్ను విధించారు. అది కేవలం ముస్లిములను ఎదుర్కోవడానికి మాత్రమే వాడేవారు. ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. పన్నెండవ శతాబ్దాంతానికి ఢిల్లిలో ముస్లిములు పాగావేయగలిగారు. వాళ్ళు అందరిమీదా విపరీతమైన పన్నులు వేసేవారు. జిజియా పన్ను అలాంటివాటిల్లో ఒకటి. ఆ పన్ను ఎలాంటిదంటే శాంతి సమయాల్లో 80% గానూ యుద్దసమయాల్లో 150% గానూ ఉండేది. ప్రజలను ముస్లిములుగా మారేందుకు ప్రోత్సహించడానికి గానూ ముస్లిములు ఈ పన్నుల నుంచి బౌద్దులకు మరియు బ్రాహ్మణులకు మినహాయింపు ఇచ్చారు. పాలకులకు పాలితులకు మధ్య బాగా దూరం పెరిగింది. ఒకప్పుడు సమాజానికి కావలసిన అన్ని రకాల అవసరాలను తీర్చగలిగిన వర్ణవ్యవస్థ Flexibilityను కోల్పోయి భయంకరమైన వ్యవస్థగా దిగజారిపోవడం మొదలయ్యింది.

బ్రిటీషర్లు వచ్చిన తరువాత హిందూ మతం ఇంకా ఎలా పతనమయ్యిందో వివరిస్తాను. బ్రిటీషర్లు ఊరిలో బాగా ధనవంతుడైన వ్యక్తిని పన్నులు వసూలుచేయడానికి ఉపయోగించుకొనేవారు. అలాంటి వ్యక్తిని “చౌదరి” అని పిలిచేవారు. ఇప్పుడు ఆ పేరు మీద ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన కులం ఉంది. మనం గమనిస్తే చౌదరి అని పేరులో ఒక భాగం కలిగిఉండేవాళ్ళు మనకు ఉత్తరభారతంలోనూ, బంగ్లాదేశ్ లోనూ, చివరికి పాకిస్తానులో కూడా కనిపిస్తారు. భాషాభేదాల వల్ల కూడా కొన్ని కొత్త కులాలు ఆవిర్భవించాయి. ఉదాహరణకు ఉపాధ్యాయులను అప్పటి సమాజంలో అయ్య వారు, అయ్యగారు అని పిలిచేవారు. అది తమిళనాడులో అయ్యంగార్ గా మారింది. ఇప్పుడు వారు తమిళనాడులో బ్రాహ్మణులలో ఒక ఉపకులంగా ఉంటున్నారు. రెడ్డి అనేది అప్పట్లో ఊరిలో బాగా ధనవంతమైన వ్యక్తిని పెద్దిరెడ్డి అని పిలిచేవారు. ఆ పిలువు ఒక పదవిగా భావించేవారు. కానీ కాలక్రమంలో రెడ్డి అనేది ఒక కులంగా రూపాంతరం చెందింది.

కులం అనేది హిందువులకు మాత్రమే పరిమితమని మనందరి దురభిప్రాయం. జైనులలో కూడా కులాలు ఉన్నాయి. హిందూ మతం నుంచి ఇతర మతాలలోకి మారినవారు ఇంకా కులాలను ఆచరిస్తున్నారు. అందుకు ప్రబల ఉదాహరణ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ Y.S. రాజశేఖరరెడ్డిగారు. ఆయన క్రైస్తవుడు, కానీ ఇంకా పేరులో రెడ్డిని ఉంచుకున్నారు. అటు రెడ్డిలను ఇటు క్రైస్తవులను ఆకర్షించగలనని ఆయన భావించి ఉండవచ్చు. మళ్ళీ భారతదేశం దాటి ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడినవారు కులాలను పట్టించుకోరు. దానికి అమెరికా, బ్రిటన్ లలో ఎన్నో సంవత్సరాలనుంచి ఉంటున్న ప్రవాస భారతీయులు ఉదాహరణ. దక్షిణాఫ్రికాలో భారతసంతతి జనాభా విపరీతంగా ఉంటారని మనకు తెలుసు. అది గాంధీ సమయం నుంచి ఉందని మనకు తెలుసు. కానీ అక్కడ ఎవరూ ఇలా కులాలను పట్ట్ంచుకోరే. హిందూమతంలో, భారతదేశంలో కాకుండా ప్రపంచంలో మరో చోటకూడా ఇలా కులాలను పాటించేవారు. అది అర్థాశిర్ అనే రాజు పర్షియాను ఏకం చేసిన కాలం. పర్షియా చరిత్రలో చెప్పుకోదగ్గ వంశాలు రెండు. అర్థాశిర్ స్థాపించినది రెండవది, మరియు అధికకాలం మనగలిగినది కూడా. ఇస్లాము పర్షియాలో అడుగుపెట్టేవరకూ ఆ వ్యవస్థ కొనసాగింది. ఆ వ్యవస్థ ఇలా సాగుతుంది. The four segments of society are Soldiers, Scribes, Priests and Commoners. దాదాపుగా వర్ణవ్యవస్థను పోలిఉంది ఆ వ్యవస్థ. ఇవి అన్నీ చెప్పడంలో నా ఉద్దేశం ఒకటే, కులవ్యవస్థ అనేది కేవలం హిందూ మతానికి మాత్రమే కాపీరైటు అయిన వ్యవస్థకాదు. సామాజికంగా జరిగే మార్పులకు ఒక మతాన్ని బలిపెట్టడం ఎంతవరకూ సమంజసం? ఎంత గొప్పగా ప్రారంభమయిన వ్యవస్థ అయినా కుళ్ళిపోవలసిందే, కానీ అప్పుడప్పుడూ గొప్ప గొప్ప యోగులు వచ్చి సమాజాన్ని బాగుచేస్తారు. బుద్దుడు, (వీరశైవమతాన్ని ప్రారంభించిన)బసవన్న, బ్రహ్మనాయుడు, శంకరాచార్య వంటి వారు ప్రతీ సమాజానికి అవసరం. కులవ్యవస్థ బ్రాహ్మణుల వల్ల వచ్చింది అనడం కేవలం చరిత్ర అస్సలు తెలియని (పిచ్చిపట్టిన కమ్యూనిస్టు) మేథావులు మాత్రమే అనగలరు. కత్తి మహేష్ కుమార్ గారూ, మీకు నా టపాలలో ఎక్కడయినా తప్పు కనబడితే చెప్పగలరు. మీరు కులవ్యవస్థకు వ్యతిరేఖి అని తెలుసు. మీరు నా టపాలకు ఏమి సమాధానం చెబుతారో చూస్తాను. మీరు ఒకసారి మీ టపాలో అన్ని కులాలవారు స్వతంత్రులని, అన్ని కులాల మధ్య కొన్ని similar rituals ఉన్నాయనీ చెప్పారు. నేను అదే వక్యాన్ని ఇలా చెబుతాను, అన్ని కులాలూ ఒకే rituals పాటిస్తారు కొన్ని తప్ప. అవి కులానికి కులానికి మధ్య మార్పులు. ఒక చిన్న ఉదాహరణ. మొదట వ్యవసాయానికి యంత్రాలు చేసేవారు ఒక కులస్థులు. వారు చెక్క మరియు ఇనుముతో యంత్రాలు చేసేవారు. తరువత వారిలో రెండు కులాలు వచ్చాయి, ఒకరు చెక్క యంత్రాలు, మరొకరు ఇనుముతో యంత్రాలు తయారుచేసేవారు. ఇనుముతో చేసేవారు ఇంకొన్ని రకాలు, ఒకరు వ్యవసాయానికి పనిముట్లు చేసేవారు, మరొకరు ఆయుధాలు తయారుచేసేవారు. అలాగే చెక్కపని చేసేవారు కూడా. ఒకరు వ్యవసాయానికి పనిముట్లు చేసేవారు మరొకరు పడవలు, ఓడలు తయారుచేసేవారు. అలా కులాలు విడిపోయాయి. మొదట సాయానికి యంత్రాలు చేసేవారు అందరూ ఒకేరకమయిన పద్దతులు పాటించేవారు. పనులలో తేడాలవల్ల ఆచరణ పద్దతులలో మార్పులు వచ్చాయి. అలా కులాల్లో పద్దతులలో పైపై మార్పులు ఉన్నా లోలోపల అన్నీ ఒకే చోటినుండి మొదలయ్యాయి. అన్ని కులాల్లోనూ పెళ్ళి జరిగేటప్పుడు తాళి ఖచ్చితంగా కడతారు, కానీ తమిళుల తాళి ఒకరకంగా, తెలుగువారి తాళి మరో రకంగా ఉంటుంది. అది భాష మరియు సాంస్కృతికంగా వచ్చిన మార్పే కానీ రెండు రాష్ట్రాలూ రెండు వేరే దేశాలనుంచి వచ్చినందువల్ల కాదు. ఇలాంటివి మనం అల్లోచిస్తే ఎన్నో గమనించవచ్చు. ఇవి అన్ని ఒకే సంస్కృతి నుంచి మారిన పద్దతులు కానీ వివిధ పద్దతులు ఒక తాటిపైకి వచ్చినవి కావు.

(ఇంకా ఒక టపా నేను బాకీ ఉన్నాను.)

వనరులు
1. Fernand Baurdel, A History of Civilizations (Penguin 1988/1963, p.232-236)
2. Will Durant, Story of Civilization, vol.1, Our Oriental Heritage, New York 1972, p.459

Wednesday, February 11, 2009

కుల వ్యవస్థ: మూడవ భాగం

మరొక్కసారి వేదాలను సరిచూసుకుని మనం కాలంలో కాస్త ముందుకు జరుగుదాము. వైదికకాలంలో ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యుడు మొదలగు దేవతలను పూజించేవారు. వేదకాలం నుంచి ఇప్పటివరకు పూజలందుకుంటున్న దేవుడు ఒక్క సూర్యుడు మాత్రమే. ఒక్కసారి అప్పటిదేవతలు వర్ణ వ్యవస్థలో ఎలాంటి పాత్రలు వేసారో. అశ్వినీ దేవతలు బ్రాహ్మణులయినా వారు Yagnaలలో పాల్గొనలేరు. విశ్వామిత్ర మహర్షి పుట్టుకతో క్షత్రియుడు, కానీ తపస్సు చేసి బ్రాహ్మణుడిగా మారాడు. పరశురాముడు రథాలను తయారుచేసే సూద్రుడు, గొడ్డలి పట్టినప్పుడు క్షత్రియుడు, తపస్సు చేసినప్పుడు బ్రాహ్మణుడు అయ్యాడు. దీనిని బట్టి మనకు అర్థం కావడంలేదా వర్ణ వ్యవస్థ ఒకప్పుడు ఎలా ఉండేదో.

ఇప్పుడు నేను హిందూ మతాన్ని స్వంత ఇంటిలోనే చావుదెబ్బ కొట్టిన వ్యక్తి గురించి మాట్లాడుతాను. అతను హింసతో హిందూమతాన్ని భయపెట్టలేదు, అహింసతో మార్పు కావాలన్నాడు. అతనే బుద్దుడు. ఒక్కసారి మనం చరిత్రను చూస్తే ద్వారక మునిగిపోయిన తరువాత భారతదేశానికి పెద్దగా బయటినుంచి గానీ అంతర్గతంగాగానీ సవాళ్ళు ఎదురుకాలేదు. అందువల్ల హిందూమతంలో మూఢనమ్మకాలు పెరిగిపోయాయి. ప్రజలు వేదాలను అనుసరిస్తున్నారు కానీ అందులో చెప్పిన పద్దతులు ఎందుకు పాటించాలో మరిచిపోయారు. ఇలా హిందూ సమాజం అంతర్గతంగా కుళ్ళిపోయి అంతర్గతంగా యుద్దాలు ఎక్కువ జరుగుతున్న సమయంలో బుద్దుడు ఆవిర్భవించాడు. బుద్దుడు వేదాల అధికారాన్ని, వర్ణవ్యవస్థను తిరస్కరించాడు. అహింసను, కర్మ సిద్దాంతాన్ని (ఇది అప్పటికే హిందూ మతంలో ఉన్నది) ప్రబోధించాడు. ప్రజలందరూ బుద్దుడిని, బుద్దమార్గాన్ని అనుసరించారు. బౌద్దమతం మధ్యఆసియా నుంచి జపాను వరకు విస్తరించింది. అంతమందికి దారిచూపిన దమ్మపాదంలో ఒక్కసారి ఏమి చెప్పారో కొంచెం చూద్దాం.

దమ్మపాదంలో బ్రాహ్మణుల గురించి, వారు పాటించాల్సిన పద్దతులగురించి చెప్పారు, కానీ వారు చేయకూడని పనుల (అంటే ఇతరులను తక్కువగా చూడడం, అంటరానితనాన్ని ప్రోత్సహించడం వంటివి) గురించి చెప్పలేదు. బ్రాహ్మణులు ఎలా జీవించాలి, ఎంత పొదుపుగా జీవించాలి అన్నదానిని దమ్మపాదంలో మనం గమనించవచ్చు. బ్రాహ్మణులు బాగా ధనం మరియు అహంతో విర్రవీగుతున్నారు కాబట్టి వాటిని ఎక్కువగా విడవాలని బుద్దభగవానుడు మనకు చెప్పాడు. కులవ్యవస్థ గురించి ఒక్కమాట కూడా చెప్పని బుద్దుడు, మరియు బౌద్దమతాన్ని కులవ్యవస్థకు వ్యతిరేఖ ప్రచారానికి వాడుకోవడం చాలా దారుణం. మనలో ఎంతమంది దమ్మపాదం చదివినవాళ్ళు ఉన్నారు? మీరందరూ ఒక్కసారి చదివి, అప్పుడు ఆ కాలంలో కులవ్యవస్థ ఉందని చెప్పండి చూద్దాం. దమ్మపాదంలో బ్రాహ్మణుడు ఎలా ఉండాలో తెలిపారు. మనం గమనిస్తే బ్రాహ్మణుడు అనే పదాన్ని ఇప్పటి సన్యాసి అనే పదానికి ప్రత్యామ్నాయంగా వాడినట్లు ఉందే కాని బ్రాహ్మణుడు అనే పదం ఒక ప్రత్యేకమయిన కులానికి గుర్తుగా లేదని మనం గమనించవచ్చు. ఒక్కసారి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు మనలో ఎవరైనా సినిమాలలో చిన్నపిల్లలను అతిగా హింసిస్తున్నారని, సినిమాలలో చిన్నపిల్లలను చూపడం నేరమని దాని గురించి మన బ్లాగులోకంలో ఎవరైనా ఒక ఇరవై టపాలు రాస్తే మనం ఎమని అనుకుంటాం? ఇతనికి పిచ్చి కానీ లేదుకదా అనుకుంటాం. This doesn’t make any sense. ఎందుకంటే ప్రస్తుతసినిమాలలో చిన్నపిల్లలను పెద్దగా చూపించడం లేదు కాబట్టి, మరియు అలా గోలచేస్తే అది జరగని హింసకు చేస్తున్న గోల. అందుకే మనం అలాంటివాటిని పెద్దగా పట్టించుకోము. అదే సినిమాలలో స్త్రీలను చాలా చవకబారుగా చూపిస్తున్నారని ఎవరైనా రాస్తే మనం ఆలోచిస్తాం, ఎందుకంటే అందులో పూర్తిగా నిజం ఉన్నది కాబట్టి. అదే విధంగా మనం బౌద్దమతం ఏ దురాచారాలకు వ్యతిరేఖంగా పోరాడిందో అవి అప్పటి సమాజంలో బాగా పాతుకుపోయినట్లు లెక్క. బౌద్దమతం హింసను విడనాడమని, బ్రాహ్మణులు సర్వం త్యజించి జీవించాలనీ, కర్మసిద్దాంతాన్నీ ప్రబోధించింది. దీనిని బట్టి అప్పటి సమాజంలో ఎలాంటి దురాచారాలు ఉన్నాయో మీరు గమనించగలరు. బౌద్దమతం తరువాత భారతదేశ పరిస్థితులను స్పష్టంగా వ్రాసిన మరో పుస్తకాన్ని మనం ఇప్పుడు చూద్దాం.

ఇప్పుడు నేను మనమందరం నమ్మదగ్గ వ్యక్తి రాసిన పుస్తకంలో నుంచి చెబుతాను. కనీసం అప్పుడు కొందరయినా కళ్ళు తెరిస్తే బాగుంటుంది. అది అప్పుడే అలెగ్జాండరు తన దండయాత్ర ముగించి వెళ్ళిన రోజులు. గ్రీకులు అప్పుడు భారతదేశం గురించి, ఇక్కడ బంగారాన్ని తవ్వే చీమలగురించి అధ్యయనం చేయడానికి ఒక వ్యక్తిని భారతదేశం పంపారు. అతని పేరు మెగస్తనీస్. అవును, ఇప్పుడు మనం మెగస్తనీస వ్రాసిన “ఇండికా” (1) అనే పుస్తకంలో నుంచి చూద్దాం భారతదేశంలో ఉన్న కులాలగురించి ఏమి రాసాడో. మెగస్తనీస్ ప్రకారం భారతదేశంలో ఏడు రకాల కులాల వాళ్ళు ఉన్నారు. Philosophers (which formed small part), Husbandmen who are majority of population and have to cultivate their land, Herdsmen and Hunters who are allowed to keep cattle and hunt animals, labor people who are hired by the king to vend wares, build ships and amours. The fifth being fighting class whose job is only to fight and nothing else. The sixth class are overseers to whom is assigned the duty of watching all that is going on. The seventh class consists of counselors and assessors of king. Philosophers అంటే బ్రాహ్మణులని మనం అర్థం చేసుకోవచ్చు. గృహస్థులు (Husbandsmen) అంటే సూద్రులు మరియు వైశ్యులు. వీరు జనాభాలో అధికశాతం వారని ప్రత్యేకంగా చెప్పాడు. Herdsmen, Hunters, Labor people లను రాజు అవసరం ఉన్నాప్పుడు ప్రత్యేకంగా నియమిస్తాడని చెప్పాడు. విదేశీ వ్యవహారాలు చూసేవారు, గూఢచారులు, సైనికులు, సలహాదారులు, మంత్రిలు మరియు రాజుకు దర్బారులో సహాయం చేసే ఇతరులందరినీ మనం క్షత్రియులుగా భావించవచ్చు. ఇవి కాకుండా కులాలమార్పు గురించి మరో మాట కూడా చెప్పాడు. ఒక వ్యక్తి ఒక కులం నుంచి ఇతర ఏ కులానికి మారడానికి వీలులేదు ఒక్క బ్రాహ్మణుడిగా తప్ప ఎందుకంటే అదే చాలా కష్టమయిన కులం కాబట్టి. ఏ కులం వ్యక్తి అయినా బ్రాహ్మణుడిగా మాత్రమే మారవచ్చు, ఇతర కులాలలోకి మారడం నిషిద్ధం. బ్రాహ్మణుడు అయిన వ్యక్తి ఏదైనా ఒక గొప్ప ఆవిష్కరణ చేస్తే అతను జీవితాంతాం పన్ను కట్టనవసరం లేదు, అదే విధంగా ఏవరైనా చెప్పినది తప్పు అని నిరూపితమయితే అతనినితో జీవితాంతాం ఎవరూ మాట్లాడకూడదని నిషేధం విధించేవారు. రాజు అలా చేయకపోయినా, ఆ వ్యక్తి జీవితంలో ఎవరితో మాట్లాడేవాడు కాదు ఎందుకంటే అప్పటి ప్రజలు నీతి నిజాయితీలకు ప్రాణాలు ఇచ్చేవారు కాబట్టి. వీరందరిలో ఎవరు అగ్రకులస్థులు, ఎవరు తక్కువ కులస్థులు? ఎవరు ఎవరిని హింసిస్తున్నారని మనం అనుకోవాలి?

ఇప్పుడు ఆ కాలంలో ఏనుగులను ఎలా పట్టేవారో వివరిస్తాను. కులవ్యవస్థకు దీనికి సంబంధం ఏమిటా అని ఆశ్చర్యపడకండి. కాస్త చదవండి మీకే అర్థమవుతుంది. ఏనుగులను పట్టడం కాస్త వింతగానూ కాస్త ఆశ్చర్యం కలిగించేదిగానూ ఉంటుంది. ఏనుగులను సంవత్సరం మొత్తం కాకుండా కేవలం ఏనుగులు శృంగారం నెరిపే కాలంలో మాత్రమే ఏనుగులను పట్టేవారు. ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో ఆడఏనుగును ఉంచేవారు. ఆడఏనుగును గమనించి ఆ దరిదాపులకు వచ్చే ఏనుగులు ఆ గొయ్యిలో పడిపోయేవి. వాటిని ఇతర ఏనుగుల ద్వారా పైకిలాగేవారు. కానీ స్వతంత్రాన్ని కోల్పోయిన ఏనుగులు చాలా దిగాలుగా ఉండేవి. వాటికి మంచి ఆహారాన్ని అందించేవారు. కొన్ని ఏనుగులు ఆహారానికి అలవాటుపడి పని చేసేవి, కానీ కొన్ని ఏనుగులు మాత్రం స్వేఛ్ఛను కోల్పోయిన కారణంగా దిగాలుగానే ఉండేవి. అలాంటి ఏనుగులకు సంగీతాన్ని వినిపించేవారు. అప్పుడు ఆ ఏనుగులు కూడా పనిచేసేవి. ఏనుగులను పట్టడానికి మన పూర్వీకులు వాడే సాధనాలు ఏమిటంటే శృంగారం, ఆహారం, సంగీతం. జంతువులను కూడా ఇంత ప్రేమగా చూసుకోగలిగిన మన పూర్వీకులు సాటి మనుషులను కులం పేరు మీద దారుణంగా ఎందుకు, ఎలా హింసిస్తారు?

కౌటిల్యుడు బ్రాహ్మణుడు, చంద్రగుప్తుడు క్షత్రియుడు (కత్తి పట్టుకున్నాడు కాబట్టి అలా అంటున్నాను). కౌటిల్యుడి తెలివితేటల వల్లనే చంద్రగుప్తుడు మౌర్యవంశాన్ని స్థాపించగలిగాడు. అలాంటి కౌటిల్యుడు తాను ఎందుకు సింహాసనాన్ని అధిరోహించలేదు? ఎందుకంటే తాను బాగా సలహాలు ఇవ్వగలడు, మరియు చంద్రగుప్తుడు బాగా యుద్దం చేయగలడు కాబట్టి. అది నిజమైన వర్ణ వ్యవస్థ అర్థం.

ఇంకా భారతదేశంలో అనాది నుంచీ కులవ్యవస్థ ఉందని నమ్మేవాళ్ళు నా ఈ అయిదు ప్రశ్నలకు సమాధానం చెప్పండి చూద్దాం.

1. కులవ్యవస్థకు వ్యతిరేఖంగా ఎవ్వరూ ఎందుకు పోరాడలేదు పూర్వకాలంలో (before 5th centuary AD)? పోనీ అగ్రకులస్థులు అందుకు అంగీకరించలేదనీ ఒకవేళ అలాంటివి జరిగినా వాటిని తొక్కేసారని మీ సమాధానం అయితే కాస్త ఈ చిన్ని ఉదాహరణలు గమనించండి. చరకసంహితలో చరకుడు సమాజంలో ఎన్నో అపోహలున్నాయనీ ప్రజలకు నాణ్యమయిన వైద్యం అందడానికి ముందు ఈ అపోహలన్నీ తొలగిపోవాలని చెప్పాడు. సమాజానికి వ్యతిరేఖంగా చరకుడు వ్రాసినదానిని మనం ఇంతవరకు చూడగలుగుతున్నాం, కానీ సామాజిక విషయాలలో ఇలా ఎందుకు వ్రాసిన గ్రంథాలలో మనం చూడలేకపోతున్నాం? వాత్సాయనుడి కామసూత్రలో మనం ఇలాంటిదే మరో సంఘటనను గమనించవచ్చు. వాత్సాయనుడి కాలాన్ని నిర్ధారించేటప్పుడు శాతకర్ణి శాతవాహనుడు తన భార్య అయిన మలయావతిని రతీసమయంలో కర్టారీ అనే వస్తువుతో కొట్టాడనీ అది కాస్త ఎక్కువై ఆమే చనిపోయిందనీ దానిని బట్టి వాత్సాయనుడి కాలాన్ని మనం అంచనా వేయగలిగాము. కామసూత్రలో శృంగారంలో అప్పట్లో ఉన్న ఇలాంటి అపోహలు తొలగిపోవాలని వాత్సాయనుడు నొక్కి చెప్పాడు. కులవ్యవస్థ గురించి మనకు అలాంటి రాతలు ఎందుకు కనబడవు? మన కలగూరగంప బ్లాగరు గారు చరిత్రలో జరిగిన ఒక చిన్న సంఘటనను వెలుగులోకి తీసుకురాగలిగారు. అది రాచవేమారెడ్డి హత్య వలన రెడ్డిరాజుల శకం అంతమైనది అనే విషయాన్ని. ఆ రాజు గారు ప్రజలమీద అధిక పన్నులు వేసి హింసిస్తున్నాడని ప్రజలే తిరగబడి చంపారని తాడేపల్లి సుభ్రహ్మణ్యం గారు “తొంగి చూసే చరిత్ర”లో చెప్పారు. అలా ప్రజలు తమకు అన్యాయం జరిగిందని అనుకున్నప్పుడు తిరగబడ్డారు కదా మరి అలాంటి సంఘటనలు చరిత్రలో మనకు కులవ్యవస్థకు వ్యతిరేఖంగా జరిగినట్లు ఎందుకు కనబడడం లేదు?

2. హిందూమతం నిజంగా అంత నికృష్టమైనదే అయితే ఇంతకాలం ఎలా నిలబడగలిగింది? మామూలు సమయాలలో బతకగలగడం గొప్ప కాదు, కానీ అంతర్గతంగా, బాహ్యంగా ఎన్నో ఆటుపోట్లను సమర్థంగా ఎలా ఎదుర్కోగలిగింది? బౌద్దం, జైనం, చార్వకం (ఈ మతం ఎప్పుడో అంతరించింది. ఈ మతం గురించి మనకు తెలిసిన వివరాలన్నీ పురాతన జైన గ్రంథాలలో మాత్రమే దొరికాయి. అప్పటి జైనఋషులకు చార్వకులకు మధ్య జరిగిన వాదాలను జైనులు గ్రంథస్తం చేసారు. అలా గ్రంథాలలో మాత్రమే చార్వకుల సంగతి మనకు తెలిసింది). అంతర్గతంగానూ క్రైస్తవం, ఇస్లాము బాహ్యంగానూ దాడులు చేసాయి, కానీ హిందూ మతం ఇంకా నిలబడగలిగింది ఎలా? ఇస్లాము మరియు క్రైస్తవం ఒకదాని తరువాత ఒకటి దాడి చేసాయి, అది కూడా ఆ మతాలు ఉఛ్ఛస్థితిలో ఉన్నప్పుడు. ఆ రెండు మతాలవారు కలిసి గత వెయ్యి సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఏలారు కానీ ప్రజలను హిందూమతానికి వ్యతిరేఖంగా మార్చలేకపోయారు ఎందుకు? ఆ మతాలవారు శాంతి కాముకులని, ఇక్కడివారిపై వారు మతాన్ని రుద్దలేదని చెప్పకండి. జిజియా పన్ను గురించి రాయవలసిన అవసరం లేదనుకుంటాను. ఆ మతాలు ఆక్రమించిన మిగతా దేశాల పరిస్థితి, మరియు ఈ దేశం పరిస్థితి చూడండి. మిగతా దేశాలన్నీ కేవలం యాభై సంవత్సరాలలో క్రైస్తవానికి మారిపోయారు. కానీ భారతదేశంలో మాత్రం పరిస్థితి వారికి అనుకూలంగా లేదు. ఇది వారి పరాజయం అనుకోవాలో లేక హిందూ మతం విజయం అనుకోవాలో నేను పాఠకుడి నిర్ణయానికి వదిలేస్తున్నాను. ఏది అనుకున్నా పరవాలేదు కానీ అది వారి దయవలన అని మాత్రం అనుకోకండి. పరీక్షలో నెగ్గితే ఎవరైనా గొప్ప వ్యక్తి అవుతాడు, అలాంటిది హిందూమతం అగ్ని పరీక్షలను వేలసంవత్సరాలనుంచి ఎదుర్కుని నిలబడగలిగింది. అధిక శాతం జనాభాను హింసించగలిగే ఏ మతం కూడా ఇంత కాలం నిలబడలేదని మనకు చరిత్ర చెబుతున్న సత్యం.

3. బానిసవ్యవస్థ మనకు సత్యహరిశ్చంద్రుడి కాలంలో తప్ప భారతీయ చరిత్రలోకానీ జీవనవిధానంలో కానీ ఎక్కడా కనబడదు (ముస్లిము దండయాత్రలవల్ల మళ్ళీ బానిస వ్యవస్థ మొదలయ్యింది). మహాభారతంలో కూడా మనకు బానిసవ్యవస్థ కనబడదు. మెగస్తనీసు కూడా బానిసవ్యవస్థ భారతదేశంలో లేదు కాబట్టి ఇక్కడి ప్రజలు అధికసంఖ్యలో పిల్లలను కనేవారని తన పుస్తకంలో చెప్పాడు. బానిసవ్యవస్థను మిగతా దేశాలు నిలబడడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే నిర్మూలించిన భారత సంప్రదాయం సాటి భారతీయులను బానిసలకు సరిజోడు అనదగ్గ అంటరానివారిగా ఎందుకు చూస్తుంది?

4. ప్రకృతి శక్తులనే (ఇంద్రుడు, వాయువు, అగ్ని, వరుణుడు, భూమి, సూర్యుడు, అష్టదిక్పాలకు etc.) కాక మానవునికంటే అల్పప్రాణులలో (పాములు, ఆవు, కుక్క, ఎద్దు etc.) కూడా దైవాన్ని చూడగలిగిన హిందూ మతం సాటి మానవులను జంతువుల కంటే నీచంగా చూస్తుందా?

5. పందొమ్మిదవ శతాబ్దపు చివరి వరకూ భారతదేశం ప్రపంచంలోనే ధనిక దేశం. ఒక దేశంలో అధికశాతమ్ జనాభా హింసను అనుభవిస్తుండగా, ఆ దేశం ధనిక దేశంగా ఎలా ఛలామణీ అవ్వగలదు? రష్యా (మాజీ USSR) లో ఎప్పుడైతే అధికశాతం ప్రజలు తిండికి, నీటికి కూడా ఇబ్బంది పడ్డారో, ఆ దేశం ముక్కలయింది. ఒక్కసారి అగ్రరాజ్యం అన్న హోదా నుంచి మామూలు దేశం అన్న హోదాకు పడిపోయింది. అలాంటిది భారతదేశం అన్ని శతాబ్దాలపాటు (శత్రువులైన ముస్లిముల చేతిలో ఆరువందలకు పైగా సంవత్సరాలు ఉన్నప్పటికీ) ఎలా ధనిక దేశంగా ఉండగలిగింది?
ఎవరైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?

Sources
1. Ancient India as described by Megasthenes and Arrian, by J. W. McCrindle

Saturday, February 7, 2009

H1B నిరాకరణ: మీడియా మాయాజాలం

H1B వీసాలతో ఉన్న భారతీయులను తీసుకోవడానికి ఇకపై కంపెనీలు సంకోచించేలా ప్రస్తుతానికి ఉన్న బిల్లును అమెరికా శాసనసభ ఆమోదించింది. దాని ప్రకారం అమెరికాలో ఉద్దీపన పథకాలు అందుకుంటున్న కంపెనీలు H1B ఉద్యోగులకన్నా ముందుగా అమెరికా పౌరులను తీసుకోవాలి. వారు ఎవ్వరూ లేకపోతే అప్పుడు మాత్రమే H1B ఉద్యోగులను తీసుకోవాలి కానీ దానికి కూడా అనేక షరతులు ఉన్నాయి. ఇకపై అమెరికా రావాలనుకుంటే చాలా కష్టమే. ఒక్కసారి ఉద్దీపన పథకాలు అందుకుంటున్న ముఖ్యమైన కంపెనీలను చూద్దాం. అవి బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూపు, వెల్స్ ఫార్గో, క్రైస్లర్, జెనరల్ మోటార్స్ ముఖ్యమైనవి. మన భారతీయులకు ఉద్యోగాలలోకి తీసుకోవడంలో కూడా ఇవే ముఖ్యమైనవి. ఈ బిల్లు వల్ల ఖచ్చితంగా భారత H1B ఉద్యోగులపై తీవ్ర ప్రభావం ఉంటుంది.

ఇప్పటిదాకా మన మీడియా ఒబామాకు మరియు ఉపాధ్యక్షుడయిన జో బిడెన్ కు చాలా ప్రచారం చేసారు. వారు భారతప్రియులని అబద్దాలను ప్రచారం చేసారు. వారి అబద్దాలన్నీ ఇవ్వాళ్టితో ప్రజలకు కనబడుతాయని అనుకుంటున్నాను. ఒబామా భారతప్రియుడని ప్రచారం చేసిన మీడియా ఇప్పుడు ఏమి సమాధానం ఇస్తుందో చూడాలి. దయచేసి ఎవ్వరూ ఒక రెండురోజులు TV9 చూడకండి, ఉన్నదానికన్నా ఎక్కువ చేసి ప్రజలను హింసిస్తాడు. ఈనాడు పత్రికను కనిపిస్తే కాల్చేయాలన్నంత కోపంగా ఉంటోంది ఈ వార్తను చదివాక. ఇన్ని అబద్దాలు ఎవరిని మభ్యపెట్టాలని ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడి పరిస్థితులు తెలియవు, కానీ వారికి నచ్చినవి మాత్రం రాస్తారు. ఒబామాకు మన భారతీయులు కూడా సాయం చేసారు క్యాలిఫోర్నియాలో. అక్కడి వాళ్ళు ఏమని అంటారో చూడాలి.

ఇక్కడ అమెరికాలో H1B ఉద్యోగులవల్ల అమెరికా పౌరులకు ఉద్యోగాలు దూరమవుతున్నాయని విపరీతమైన ప్రచారం. అందుకే అనేక అమెరికన్లకు భారతీయులంటే ఇష్టం ఉండదు. వారి ముప్పైకోట్ల జనాభాకు మన ముప్పైలక్షలమంది ఏ విధంగా అడ్డంకో నాకు అర్థం కాదు. వారు కూడా మెదడుతో ఆలోచించరు. ఈ మీడియా ఏమి చెబితే అది నమ్ముతారు. ఇక అమెరికాలో ఉండే ప్రవాస భారతీయులకు చాలా కష్టమే. సొంతగూటికి వెళ్ళలేరు, ఇక్కడే ఉండలేరు. ఇక అమెరికాలో ఉంటున్న ప్రవాసభారతీయులను ఆ దేవుడే కాపాడాలి. అమెరికాలో అమెరికా పౌరులకన్నా H1B ఉద్యోగులే ఎక్కువ ట్యాక్సు కడతారని అక్కడి పాలకులు మరచినట్లున్నారు. ఇక్కడ అమెరికన్లు ఉద్యోగం చేస్తేనే పన్నులు కడతారు కానీ H1B ఉద్యోగులు ఉద్యోగంతో సంబంధం లేకుండా పన్ను కడతారని అమెరికా పాలకులు మరచిపోతున్నారు.

Thursday, February 5, 2009

అమెరికా రాజకీయాలు

కులవ్యవస్థ గురించి తరువాతి టపాలో మాట్లాడుకుందాం. ప్రస్తుతం అమెరికా రాజకీయాల గురించి నేను గమనించిన కొన్ని విషయాలు పంచుకోదలచుకున్నాను. నేను చెప్పబోయే కొన్నింటికి ఆధారాలు లేవు కేవలం నా అనుమానం తప్ప. కానీ వేచి చూడాలి ఏమి జరుగబోతుందో.

మొదట ఈ మధ్యనే ముగిసిన ఎన్నికల గురించి. ఈ ఎన్నికలలో గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రెసిడెంటు అభ్యర్థి అయిన ఒబామాకు అనుభవం లేకపోవడం. ఈ విషయం గురించి ప్రముఖ పత్రికలు ఒక్కటి కూడా పెదవి విప్పకపోవడం. అతని ప్రత్యర్థి అయిన మెక్కెయిన్ చాలా ముదుసలి. అతని ఉపాధ్యక్ష అభ్యర్థురాలు సారాహ్ పేలిన్ కూడా అనుభవం లేదు. మెక్కెయిన్ చనిపోతే సారాహ్ పేలిన్ అధ్యక్షురాలిగా ఉంటుంది. అప్పుడు ఇరుపక్కలా అభ్యర్థులు అనుభవం లేని వారే. మెక్కెయిన్ సారాహ్ పేలిన్ను ఎందుకు అభ్యర్థిగా ఎంచుకున్నాడో ఎవరికీ తెలియదు. ఆమెకన్నా ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కోగలిగేవారు, అధిక శాతం ఓట్లను తెచ్చేవారు ఇతరులు అనేకులు ఉన్నారు కానీ, మెక్కెయిన్ సారాహ్ పేలిన్ను తన ఉపాధ్యక్ష అభ్యర్థురాలుగా తీసుకున్నాడు. ఆమె రావడం వెనుక ఏమి మతలబు ఉందో ఎవరికీ తెలియదు.

మనం ఇంకొంచెం వెనుకకు వెళితే 2004లో జరిగిన ఎన్నికలు గురించి. ఆ ఎన్నికలలో ప్రధాన అభ్యర్థులు జార్జి బుష్ (R) మరియు జాన్ కెర్రీ (D). ఎన్నికలు చివరి ఘట్టంలో ఉండగా బిన్ లాడెను ఒక క్యాసెటు విడుదల చేసాడు. అది ఎన్నికలకు సరిగ్గా రెండు మూడు రోజులముందు. అంతే చిన్న ఆధిక్యంతో జార్జి బుష్ గెలిచాడు. ఆ ఎన్నికలలో జరగని ఒక విషయాన్ని ప్రస్తావించదలిచాను. అదే విధంగా ఈ సారి ఎన్నికలకు వారం ముందు విడుదలయిన ఒక పాలస్తీనా తీవ్రవాదసంస్థ యొక్క క్యాసెట్టు మాత్రం లాస్ ఏంజిలిస్ టైమ్స్ పత్రిక విడుదల చేయలేదు. ఆ క్యాసెట్టు గురించి చిన్న చిన్న పుకార్లు వచ్చాయి. అందులో ఒబామా అధ్యక్షుడు అయితే తమ తీవ్రవాద సంస్థలకు లాభమని ఇద్దరు తోవ్రవాదులు మాట్లాడుకున్నారు. ఆ క్యాసెట్టును తొక్కిపెట్టారని తెలిసింది.

2000 ఎన్నికలలో బుష్ కన్నా అధికశాతం ఓట్లు (కానీ కావలసినన్ని సీట్లు రాలేదు. ఎన్నికలలో ఓట్లను అలా ప్రకటించడం అదే ప్రథమం) సంపాదించిన ఆల్ గోర్ తను పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిసినా పోటీ చేయలేదు. అనేక సర్వేలు ఆల్ గోర్ పోటీ చేస్తే గెలుస్తాడని చెప్పాయి, కానీ ఆల్ గోర్ పోటీ చేయలేదు. ఎందుకో ఎవరికీ తెలియదు. కానీ 2007లో నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇచ్చారు. పర్యావరణం గురించి అవగాహన కలిగించడం వలన ఆల్ గోర్, Panel on Climate change సంస్థకు సంయుక్తంగా ఆ పురక్కారాని అందించారు. ఈ విషయాన్ని వెల్లడి చేసాక Washington DCలో మరియు చుట్టుపక్కల ఆల్ గోర్ ను కించపరిచే విధంగా ప్రచారం సాగింది. ఆల్ గోర్ను అతను చెప్పిన పద్దతులను విమర్శిస్తూ Washington DCలో Booklets పంచిపెట్టారు. అది ఎందుకో నాకు తెలియదు. కానీ నాకు ఎందుకో ఆల్ గోర్ 2004లో పోటీ చేయనందుకు అతనికి ఆ పురస్కారాన్ని ఇచ్చారని అనిపిస్తోంది. దీనికి ఆధారాలంటారా. నా దగ్గర ఏవీ లేవు కేవలం నా అనుమానం తప్ప. కేవలం బుష్ పదవిలోకి రావడం కోసమే ఇది చేసారని అర్థం అవుతోంది. అందుకే ఎలక్షన్లకు మూడు రోజులముందు బిన్ లాడెను నుంచి బెదిరింపు క్యాసెట్టు రావడం. 2004లో బుష్ రావడం, ఇప్పుడు అమెరికా ఆర్థికవ్యవస్థ కూలిపోవడానికి సిద్దంగా ఉండడం, పోటీ చేయనందుకు ఆల్ గోర్ కు పురస్కారం రావడం. ఎందుకో తేడా కనబడుతోంది నాకు ఈ చిత్రంలో.

ఇప్పుడు ఒబామా దగ్గరికి వద్దాం. ఒబామా ఇక్కడ ఎన్నికలలో పోటీ చేయడం ఏమిటో గానీ ఈనాడు పత్రిక చాలా హంగామా చేసింది మరియు చేస్తోంది. రోజూ ఒబామా గురించి ఏదో ఒకటి రాస్తోంది. మన తెలుగువారు ఎక్కువగా హిల్లరీ క్లింటనుకు మద్దతు ఇచ్చారు. కానీ అప్పుడు ఈనాడు పత్రిక ఏమీ రాయలేదు. ఎప్పుడయితే ఒబామా అధ్యక్షుడి అభ్యర్థిత్వం ఖరారయ్యిందో అప్పటినుంచి ఈనాడులో అతని గురించి వ్యాసాలు వెల్లువెత్తాయి. ఒక్క విషయం నాకు ఒబామా అంటే వ్యతిరేఖత ఏమీ లేదు, కానీ ఎప్పుడూ లేనిది ఇలా ఒక ప్రాంతీయ పత్రిక అమెరికా అధ్యక్షుడి గురించి ఇంతలా పొగడడం ఎందుకో నాకు తేడాగా అనిపిస్తోంది.

మరొక్క విషయం. ఇది కూడా కేవలం నా అనుమానం మాత్రమే, మరియు నాకు ఒబామా అంటే వ్యతిరేఖతలేదని మరోసారి చెబుతున్నాను. అమెరికా అధ్యక్షనివాసం పేరు వైట్ హౌజ్ అంటే తెల్లని గృహం అని అర్థం. కానీ బాగా తెలిసిన వాళ్ళు చెప్పేది కేవలం తెల్లవాళ్ళ గృహం అని. ఒక తెల్లవాళ్ళ గృహానికి నల్లవాడు అధ్యక్షుడయ్యాడంటే ఏదో తిరకాసు ఉందని అనిపిస్తోంది. నాకు ఎందుకో ఒబామాను ఆరునెలలు లేదా సంవత్సరంలో చంపేస్తారని అనిపిస్తోంది. ఎందుకో తెలియదు, ఆధారాలు కూడా లేవు కానీ ఇది మాత్రం జరుగుతుందనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే అరవైలలో మాదిరిగా తెల్లవాళ్ళు నల్లవాళ్ళ మధ్య గొడవలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇప్పటికే మన ఆంధ్రులను, భారతీయులను ఎందుకు చంపుతున్నారో తెలియకుండా చంపుతున్నారు. ఇక నా అనుమానం కానీ నిజమయిందంటే…………..
అలా జరుగకూడదని దేవుడిని ప్రార్థిస్తూ……………..

సెలవు.


( D - Democrat, R - Republican)